ఖమ్మం నగరంలో గంజాయి సేవించిన ముగ్గురు వ్యక్తులను ఖమ్మం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి మూత్ర పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. శుక్రవారం మధ్యాహ్నం బైపాస్ రోడ్డులో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
ఖమ్మం నగరంలో గంజాయి సేవించినట్లు పరీక్షల్లో తేలడంతో ముగ్గురు వ్యక్తులపై ఖమ్మం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
ఖమ్మం టూ టౌన్ ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం మధ్యాహ్నం సుమారు 12.25 గంటలకు బైపాస్ రోడ్డులో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు ఇందిరానగర్ శ్మశానవాటిక ఎదుట ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.
వారిని ప్రశ్నించగా, గంజాయికి అలవాటు పడ్డామని, శుక్రవారం ఉదయం కూడా గంజాయి సేవించామని చెప్పారు. వారిని విచారించగా, ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయి తీసుకున్నట్లు వారు వెల్లడించారు.
పరీక్షల్లో పాజిటివ్
అనంతరం 12-ప్యానల్ కిట్ తో మూత్ర పరీక్షలు నిర్వహించగా, వారిలో ఇందిరానగర్ లోని చైతన్యనగర్ కు చెందిన ఆటో డ్రైవర్, కురా రాజేశ్వర్ అలియాస్ రాజేష్ (30), పాండురంగాపురానికి చెందిన డ్రైవర్, బింకా సురేష్ (27), రోటరీనగర్ కు చెందిన డీసీఎం డ్రైవర్ వట్టికోటి నరేష్ (36) లకు పాజిటివ్ గా వచ్చింది. దీంతో ముగ్గురినీ పోలీస్ స్టేషన్ కు తరలించి, పరీక్ష ఫలితాల ఆధారంగా వారిపై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






