నాణ్యతలో రాజీ వద్దు: సర్పంచ్ కర్పెత విమలాబాయి
గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న ప్రతి పనీ నాణ్యతతో, పక్కాగా జరగాలని కెరమెరి మండలం సాంగ్వి సర్పంచ్ కర్పెత విమలబాయి స్పష్టం చేశారు. శుక్రవారం గ్రామపంచాయతీ పరిధిలోని ఎంపీయూపీఎస్ పాఠశాలలో విబి-జి రాంజీ పథకం కింద మంజూరైన చేతి పంపు, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పనులకు సంబంధించిన ఇంకుడు గుంతలను ఆమె స్వయంగా పరిశీలించారు.
పనుల పురోగతిని, నిర్మాణ నాణ్యతను ఒక్కొక్కటిగా పరిశీలించిన సర్పంచ్, పనులు చేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని, విద్యార్థులకు నిజమైన ప్రయోజనం చేకూరేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
గ్రామంలో ఏ పని జరిగినా తానే స్వయంగా వెళ్లి పరిశీలించడం విమలబాయి ప్రత్యేకత. అందుకే సాంగ్విలో జరిగే ప్రతి అభివృద్ధి పనిలోనూ నాణ్యత కనిపిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు.

