ఖమ్మం, 13 November
మాదకద్రవ్యాల మహమ్మారిని రాష్ట్రం నుండి తరిమికొట్టేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, ఇందులో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
మాదకద్రవ్యాల మహమ్మారిని రాష్ట్రం నుండి తరిమికొట్టేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, ఇందులో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, ఐ అండ్ పీఆర్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన క్విజ్ పోటీల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈగిల్ టీమ్ తో 8 వేల కేసులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో డ్రగ్స్ నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో 600 మందితో ఈగిల్ టీమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు 8 వేల కేసులు నమోదు చేసి 19 వేల మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. ఎవరు సిఫార్సు చేసినా వదిలేది లేదని, సొంత మనుషులైనా జైలుకేనని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు.
గత ప్రభుత్వంపై విమర్శలు
గత పాలనలో డ్రగ్స్ నియంత్రణపై చిత్తశుద్ధి లేదని, మాజీ మంత్రుల ఫామ్ హౌస్లలోనే డ్రగ్స్ పట్టుబడ్డాయని విమర్శించారు. డ్రగ్స్ భయంతోనే నాటి మంత్రులు తమ పిల్లలను విదేశాల్లో చదివించారన్నారు.
తల్లిదండ్రులు, టీచర్లకు సూచన
డ్రగ్స్ నియంత్రణ కేవలం పోలీసులతోనే కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులు ఫ్యాషన్ కోసం, స్నేహితుల ఒత్తిడితో మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఎక్సైజ్ అదనపు కమిషనర్ కిషన్, డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, జానయ్య, ఏదులాపురం చైర్ పర్సన్ పోకబత్తిని అనిత తదితరులు పాల్గొన్నారు.






