ఖమ్మం, 13 November
ఖమ్మం అర్బన్: ఖమ్మం ఎస్ ఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పుటాని తండా గ్రామానికి చెందిన భూక్యా కమల్ (17) ఖమ్మంలోని ఎస్ ఆర్ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో ద్వితీయ సంవత్సరం బైపిసి చదువుతున్న విద్యార్థులు తేజ, విష్ణు, ఉదయ్ లు కలిసి ప్రథమ సంవత్సరం చదువుతున్న కమల్ పై కళాశాలలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో విద్యార్థి ముక్కు తీవ్రంగా గాయపడింది.
యాజమాన్యం నిర్లక్ష్యం
కళాశాలలో దాడి జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా రెండు రోజుల పాటు గోప్యంగా ఉంచారు. కళాశాల యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కళాశాల యజమానులైన భాస్కర్ రెడ్డి, అశోక్, శ్రీనివాస్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లి ఆరోపించారు.
ఈ విషయమై విద్యార్థి తల్లి ఫిర్యాదు మేరకు ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు. ఈ కేసును సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణ కుమార్ లు దర్యాప్తు చేపట్టారు.






