కొత్తగూడెం, 7 November
భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళల్లో వరుస చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.27.71 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు ల్యాప్ టాప్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళల్లో వరుస చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ శనివారం వెల్లడించారు.
ఇల్లందు పట్టణంలోని జేకే కాలనీ, సుభాష్ నగర్, ఆజాద్ నగర్, బెంగల్ రావు కాలనీ తదితర ప్రాంతాల్లో జరిగిన చోరీలపై దర్యాప్తు చేపట్టిన ఇల్లందు పోలీసులు ముగ్గురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని ఇల్లందు 14వ నంబర్ బస్తీకి చెందిన విశాల్ కుమార్, 15వ నంబర్ బస్తీకి చెందిన గౌతమ్, కోరి కల్యాణ్ గా గుర్తించారు. విచారణలో 10 చోరీలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారని ఎస్పీ తెలిపారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు
నిందితుల నుంచి రూ.23.10 లక్షల విలువైన 165 గ్రాముల బంగారం, రూ.4.41 లక్షల విలువైన 2 కిలోల 205 గ్రాముల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక ల్యాప్ టాప్, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ చేసిన ముగ్గురినీ శనివారం న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
పోలీసుల అభినందన, ప్రజలకు సూచనలు
కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించిన ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, సీఐ సురేష్ తో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.












