ఖమ్మం రూరల్, 10 November
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ఖచ్చితమైన రికార్డులను రూపొందించేందుకు చేపట్టిన భూ రీ-సర్వేకు క్షేత్రస్థాయిలో ఉన్న భూమే ప్రామాణికమని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ స్పష్టం చేశారు. ఖమ్మం మండలం మద్దులపల్లి గ్రామంలో మంగళవారం ఆయన భూ రీ-సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ఖచ్చితమైన రికార్డులను రూపొందించడం కోసం చేపట్టిన భూ రీ-సర్వేకు క్షేత్రస్థాయిలో ఉన్న భూమే ప్రామాణికమని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. ఖమ్మం మండలం మద్దులపల్లి రెవెన్యూ గ్రామంలో పొలం కాల్వగట్లపై ద్విచక్ర వాహనంలో ప్రయాణించి, కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు, భూ యజమానుల సమక్షంలో రోవర్, ట్యాబ్ తదితర ఆధునిక సాంకేతిక పరికరాలతో నిర్వహిస్తున్న డిజిటల్ సర్వే ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. సర్వే నిర్వహిస్తున్న విధానం, ఇప్పటివరకు పూర్తయిన, మిగిలిన ప్రక్రియ పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కలెక్టర్ రైతులతో నేరుగా మాట్లాడుతూ, భూ రీ-సర్వే ఉద్దేశ్యం, సర్వే నిర్వహణ విధానం, భూ రికార్డుల క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. రైతులు అడిగిన సందేహాలు, అనుమానాలను తెలుసుకుని వాటిని నివృత్తి చేశారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి అపోహలకు తావులేకుండా ప్రతి అంశాన్ని రైతుల సమక్షంలో పరిశీలించి, వాస్తవాలను మాత్రమే నమోదు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
రీ-సర్వే ప్రాముఖ్యత
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, భూమి ఉండి పట్టాదారు పాస్‌బుక్‌లు లేనివారు, పట్టాదారు పాస్‌బుక్‌లు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలోని భూ విస్తీర్ణం, హద్దులు, ఇతర వివరాలు రికార్డులతో సరిపోనివారు, అలాగే రికార్డుల్లో భూమి వివరాలు నమోదు కాని సందర్భాలను రీ-సర్వే ద్వారా గుర్తించి, నిబంధనల ప్రకారం పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు. భూమి హద్దుల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు, వివాదాలు తలెత్తకుండా రీ-సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
రీ-సర్వేలో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఎవరు భూమిని సాగు చేస్తున్నారు, వారి పేరుపై ఎంత విస్తీర్ణం నమోదై ఉంది, పట్టాదారు పాస్‌బుక్ ఉందా లేదా, రికార్డుల్లో నమోదైన వివరాలు క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోతున్నాయా అనే అంశాలను సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. పట్టాదారు పాస్‌బుక్‌లో నమోదైన విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ విస్తీర్ణానికి మధ్య తేడా ఉంటే, చుట్టుపక్కల రైతుల సమక్షంలో కొలతలు నిర్వహించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాలని అన్నారు. అవసరమైన సందర్భాల్లో పంచనామా నిర్వహించి వివరాలను నమోదు చేయాలని అన్నారు.
అధికారులకు సూచనలు
సర్వే సందర్భంగా సంబంధిత భూ యజమానికి వివరాలను తెలియజేసి, నిబంధనల ప్రకారం వారి సమ్మతిని నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతుల వద్ద ఉన్న పట్టాదారు పాస్‌బుక్‌లు, పాత పహాణీలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, సాగుకు సంబంధించిన ఇతర ఆధారాలను పరిశీలించి, అవసరమైన వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. సర్వే నోటీసు అందించినట్లు రసీదు తీసుకోవడం, ఫోటోలతో కూడిన పంచనామా రూపొందించడం, ఆధార్, మొబైల్ నంబర్ తదితర అవసరమైన వివరాలను నమోదు చేయడం వంటి ప్రక్రియలను తప్పనిసరిగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి భూమికి సంబంధించిన వాస్తవ విస్తీర్ణం, హద్దులు, సర్వే నంబర్లు, పట్టాదారు వివరాలను పాత రికార్డులతో సరిపోల్చి ఖచ్చితంగా నమోదు చేయాలని అన్నారు.

