హనుమకొండ జిల్లా మండలం సీతంపేట గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేకమైన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంప్రదాయం సుమారు 200 ఏళ్లుగా కొనసాగుతోందని గ్రామస్థులు తెలిపారు.
తెలంగాణలో సాధారణంగా దసరా సమయంలో నిర్వహించే బతుకమ్మ సంబరాలకు భిన్నంగా, సీతంపేట గ్రామంలో మాత్రం దీపావళి పండుగ వేళ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం ప్రత్యేకతగా నిలుస్తోంది. గ్రామంలోని నేతకాని సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఈ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నాయి. వేడుకల్లో మహిళలతో పాటు పురుషులు కూడా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ పాల్గొన్నారు. గ్రామ ప్రధాన వీధుల గుండా బతుకమ్మల ఊరేగింపు నిర్వహించి, చివరగా గ్రామ శివారులోని చెరువు వద్ద నిమజ్జనం చేశారు.
వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్థులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సొంతూరికి చేరుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలను కొనసాగిస్తూ మహిళలు, పురుషులు కలిసి బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం సీతంపేట ప్రత్యేకతగా నిలిచింది. ఈ ప్రత్యేక సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్న గ్రామస్థులను పలువురు అభినందించారు.





