కెరమెరి (ఆజాద్ తెలంగాణ) నవంబర్ 02
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి కెరమెరి కేరమేరి కోలాంగూడ గ్రామానికి చేందిన ఆదిమ గిరిజనులు, తమకు పక్కా ఇళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా గుడిసేలు, రేకుల షేడ్లలోనే నివసిస్తున్న సుమారు 10 కొలాం కుటుంబాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం జిల్లా కలేక్టర్ను ఆశ్రయించాయి.
స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లయినా ఇప్పటికీ అడవి బిడ్డల బతుకులు గుడిసెల్లోనే కొనసాగుతున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని మారుమూల గ్రామం బోరిలాల్ గూడ గ్రామపంచాయతీ పరిధిలోని కోలాంగూడలో ఆదిమ గిరిజనుల దీనగాథ ఇది.
కోలాంగూడకు చెందిన ఆదిమ తెగ పివిటిజి - కొలాం జాతికి చెందిన సుమారు 10 కుటుంబాలు తరతరాలుగా అటవీ ప్రాంతంలోనే నివసిస్తున్నాయి. వారికి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. వర్షం వస్తే కారే గుడిసెలు, ఎండకు మాడే రేకుల షెడ్లలోనే వారి జీవనం సాగుతోంది. ఈ దయనీయ పరిస్థితిపై ఆవేదనతో వారు సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి తరలివచ్చారు.
సర్పంచ్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి
బోరిలాల్ గూడ గ్రామ సర్పంచ్ చవాన్ శంకర్ ఆధ్వర్యంలో కోలాంగూడకు చెందిన గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు తమ గోడును వినిపించారు.
తమ గూడలో అత్యంత నిరుపేద కుటుంబాలు ఉన్నాయని, తమకు ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో తమకు ప్రాధాన్యత ఇచ్చి ఇళ్లు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు.
సర్పంచ్ చవాన్ శంకర్ మాట్లాడుతూ...
మా గ్రామపంచాయతీ పరిధిలోని కోలాంగూడ ఆదివాసీలు చాలా వెనుకబడి ఉన్నారు. వారికి సొంత ఇల్లు లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందడం లేదు. జిల్లా కలెక్టర్ మానవతా దృక్పథంతో స్పందించి, తక్షణమే విచారణ జరిపి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి అని కోరారు.
జిల్లా కలెక్టర్ వినతి పత్రాన్ని స్వీకరించి, సంబంధిత ఎంపీడీవో, హౌసింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి, అర్హుల జాబితాలో వారి పేర్లను చేర్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
నిజమైన అర్హులకు దక్కుతాయా
రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో, అత్యంత వెనుకబడిన పివిటీజీ తెగకు చెందిన ఈ ఆదివాసీ కుటుంబాలకు ఇళ్లు మంజూరు అవుతాయా లేక వారి ఆశలు అడవిలోనే కలిసిపోతాయా అనేది వేచి చూడాలి.





