గీత వృత్తిని తక్షణమే ఆధునికరించాలని, ఎటువంటి ఆంక్షలు లేకుండా గీతా కార్మికులకు పెన్షన్ మంజూరు చేయాలని తెలంగాణ కల్లు గీతా కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈనెల 16వ తేదీన కలెక్టరేట్ ముట్టడికి సంఘం పిలుపునిచ్చింది. మండలంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.
మండలంలో శుక్రవారం తెలంగాణ కల్లు గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల అధ్యక్ష కార్యదర్శులు జనగాని లక్ష్మీనారాయణ, బత్తిని శ్రీనివాస్ గౌడ్ ల అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, బండి రంజిత్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, అనాదికాలం నుండి గీతా కార్మికులు ఎటువంటి ఆదరణ లేకుండా వృత్తిని నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దినదినం గీత వృత్తి నశించిపోతుందని, కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ వృత్తిపై అధ్యయనం చేసి ఆధునికీకరణకు చర్యలు చేపట్టాలని కల్లుగీతా కార్మిక సంఘం డిమాండ్ చేసింది. తాటి, ఈత పొట్టి వంగడాలను అందించి, 5 ఎకరాల ప్రభుత్వ భూమిని అందించాలని, ప్రభుత్వ భూమి లేని పక్షంలో కొనుగోలు చేసి సొసైటీలకు కేటాయించాలని సంఘం కోరింది.
నీరా, తాటి ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించి గౌడ గీతా కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. గీతా కార్మికులకు ఎటువంటి షరతులు లేకుండా పెన్షన్లు మంజూరు చేయాలని, ఈనెల 16వ తేదీన కలెక్టర్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ ముట్టడిని విజయవంతం చేయాలని గీతా కార్మికులను, సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌని సాంబయ్య గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూలం ప్రభాకర్ గౌడ్, మోటపోతుల రాజు గౌడ్, ఆముదాల పల్లి మల్లేశం గౌడ్, వల్లాల గంగాధర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు ముంజ విజేందర్ గౌడ్, చింతమధుగౌడ్, ముంజ సంతోష్ గౌడ్, కల్లెపు శోభారాణి గౌడ్, పబ్బ లావణ్య గౌడ్, బండి సదానందం గౌడ్, మార్క అశోక్ గౌడ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గట్టు కార్తీక్ గౌడ్, పోశాల అశోక్ కుమార్ గౌడ్, చింత శ్రీనివాస్ గౌడ్, మోటపోతుల రవీందర్ గౌడ్, గౌరవ సలహాదారు యాదగిరి గౌడ్, ఉపాధ్యక్షుడు శ్రీపతి సదానందం, గౌడ సంఘం అధ్యక్షుడు కుమారస్వామి, జనగాని ప్రవీణ్, గోడిశాల అర్జున్, శ్రీపతి బిక్షపతి గౌడ్, గోడిశాల సుమన్ గౌడ్, శ్రీపతి రాజేష్, విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
