కేరమేరి (ఆజాద్ తెలంగాణ) నవంబర్ 11
కెరమెరి మండలం సాకడ బి గ్రామంలో ఆదివాసీ సంప్రదాయ దండారీ ఉత్సవాలు కోలబోడి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి.
కెరమెరి మండలం సాకడ బి గ్రామంలో ఆదివాసీ సంప్రదాయ దండారీ ఉత్సవాలు కోలబోడి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. భోగి పండుగతో ప్రారంభమైన దండారీ ఉత్సవాలు దీపావళి అనంతరం కోలబోడితో ముగింపుకు చేరాయి.
ఈ సందర్భంగా సాకడ బి గ్రామ యువకులు తెల్లని వస్త్రాలు ధరించి, ఎర్రటి తలపాగాలతో, చేతిలో సంప్రదాయ కోలలు పట్టుకుని కోలాట నృత్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. చేతిలో హారతి పళ్లెం, దీపంతో భక్తిశ్రద్ధలతో కోలబోడి పూజలు నిర్వహించారు.
అనంతరం గ్రామస్తులు, పెద్దలు గ్రామ శివారులోని ఇప్పచెట్టు వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి, చెట్టుకు ఆభరణాలు కట్టి, హారతి ఇచ్చి సంప్రదాయబద్ధంగా ఉత్సవాలకు తెరదించారు.
ఈ సందర్భంగా ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సేడ్మాకి తుకారాం, గ్రామ పెద్దలు మాట్లాడుతూ దండారీ అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, మన ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని మన తాత ముత్తాతల నుండి వస్తున్న ఈ సంప్రదాయాన్ని యువత ముందుకు తీసుకెళ్లాలి అని అన్నారు.
కార్యక్రమంలో గ్రామ పటేల్ కనక అంబాజీరావు, పెద్దలు మాడవి తుకారాం, కుర్సెంగా దుందేరావు, మాడవి ప్రభు, కనక దాంబిరావు, కనక భగవంత్‌రావు, పరచకి మోతిరం, లింబరావు, ఆత్రం సీతారాం, యువకులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

