నిర్మల్, 13 November
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కృష్ణవేణి పాఠశాలలో శుక్రవారం ఫుడ్ ఫెస్టివల్ (ఆహార పండుగ) కార్యక్రమాన్ని అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల డైరెక్టర్ శ్రీ గాండ్ల కీర్తి శ్రీనివాస్ గారు పిల్లలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాలు విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గోగుల రమేష్ గారు మాట్లాడుతూ, నేటి కాలంలో చిన్నారులకు పౌష్టికాహారం, ఆహారపు అలవాట్లు, మరియు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ ఆవశ్యకతను చక్కగా వివరించారు. విద్యార్థులు స్వయంగా వివిధ రకాల వంటకాలను ప్రదర్శించడం అభినందనీయమని ఆయన కొనియాడారు.
ఈ వేడుకలలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

