రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండల కేంద్రంలో ఎంపీడీవో సాయికుమార్ గౌడ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. అయితే, 19 శాఖలకు గాను కేవలం 10 శాఖల అధికారులే హాజరు కావడంతో సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమావేశం అరగంట పాటు నిలిచిపోయింది.
మండలంలోని 19 శాఖలకు సంబంధించిన అధికారులు హాజరు కావాల్సి ఉండగా, కేవలం 10 శాఖల అధికారులే హాజరయ్యారు. సమావేశానికి హాజరైన ప్రత్యేక అధికారి, డీఏవో వెంకట్ ను సర్పంచులు ప్రశ్నించారు. గతంలో జరిగిన సమావేశాలకు కూడా అధికారులు హాజరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సమావేశాన్ని బహిష్కరించి కార్యాలయం బయటకు వెళ్లిపోయారు. ఎంపీడీవో సాయి కుమార్ గౌడ్ జోక్యం చేసుకుని, తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొదటి సమావేశం కావడంతో, హాజరు కావాలని, సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సర్పంచులు లేవనెత్తిన సమస్యలను తదుపరి సమావేశంలోగా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో, వారు తిరిగి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తాసిల్దార్ నాగార్జున గౌడ్, వ్యవసాయ శాఖ మండల అధికారి యుగేందర్, ఏపీవో మల్లయ్య, విద్యుత్ శాఖ అధికారి రమేష్, అటవీ సెక్షన్ అధికారి శ్రీనివాస్, అసిస్టెంట్ సిడిపిఓ ఫాతిమ, ఐకెపి ఏపీఎం ముక్తేశ్వర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ తమ నివేదికలను సభ ముందు చదివి వినిపించారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామపంచాయతీ పరిధిలో విద్యుత్ తీగలను సరిచేయడం, ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని కోరారు.
ఎల్ నినో ప్రభావంతో మండలంలో పత్తి రైతులకు దిగుబడి లేక నష్టపోతున్నారని, కొన్ని గ్రామాల్లో ఎకరాకు 2 క్వింటాళ్ల పత్తి దిగుబడి కూడా రాలేదని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పంట నష్ట అంచనా విలువలను రూపొందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సర్పంచులు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనులను అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని, గ్రామీణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల ఖర్చుల వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్సైట్ను త్వరలో ప్రారంభిస్తామని ఎంపీడీవో సాయికుమార్ గౌడ్ తెలిపారు. ఈ వెబ్సైట్లో అభివృద్ధి పనుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎల్ నినో ప్రభావంతో యాసంగికి అనువైన పంటలు వేయాలని డీఏవో వెంకట్ సూచించారు. జిల్లాలో మూడు మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదవ్వడంతో కరువు మండలాలుగా ప్రకటించామని, మిగిలిన మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని తెలిపారు. పంట నష్టం జరిగిన రైతులను గుర్తించి నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు చెప్పారు. త్వరలోనే వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరిస్తారని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

