_మేడ్చల్-మల్కాజిగిరి (ఆజాద్ తెలంగాణ) నవంబర్ 09
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కేసులో చార్జ్‌షీట్ వేయడానికి రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేయగా, ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసుకు సంబంధించి చార్జ్‌షీట్ వేయాలని బాధితుడు ఎస్సై శ్రీనివాస్‌ను కోరారు. దీనికి ప్రతిఫలంగా ఎస్సై రూ.2 లక్షల నగదు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అంత పెద్ద మొత్తం ఇవ్వలేకపోయిన బాధితుడు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. సోమవారం ఉదయం శిల్పా నగర్ వద్ద బాధితుడి నుంచి ఎస్సై శ్రీనివాస్ రూ.2 లక్షల నగదును లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ బృందం ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
అధికారులు ఆయన వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ చేపట్టారు. కీసర పోలీస్ స్టేషన్లో కొద్ది నెలల వ్యవధిలోనే ఇలాంటి అవినీతి ఘటన మరోసారి వెలుగుచూడటం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది.





