కొత్తగూడెం, 2026-11-08
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్రెడిట్ కార్డు మోసాన గురైన బాధితుడికి సైబర్ క్రైమ్ పోలీసులు ఊరట కలిగించారు. సైబర్ నేరగాళ్లు నాలుగు విడతల్లో రూ.4,97,526 కాజేయగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రూ.1,62,470 తిరిగి రికవరీ చేశారు.
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి లక్షల రూపాయలు కోల్పోయిన బాధితుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు ఊరట కలిగించారు.
అశ్వాపురం పరిధిలోని హెవీ వాటర్ ప్లాంట్ లో పనిచేస్తున్న సుశీల్ కుమార్ క్రెడిట్ కార్డు నుంచి సైబర్ నేరగాళ్లు నాలుగు విడతల్లో రూ.4,97,526 కాజేశారు.
లావాదేవీలను గుర్తించిన వెంటనే సుశీల్ కుమార్ 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ సెల్ అధికారులు లావాదేవీలను పరిశీలించి, సంబంధిత బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకున్నారు. దీంతో రూ.1,62,470 బాధితుడి ఖాతాలోకి తిరిగి జమ కాగా, మరో రూ.3,35,056 బ్యాంకు ఖాతాల్లో నిలిపివేశారు అని జిల్లా ఎస్పీ కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
ఈ ఘటనపై అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 162/2026 గా కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 318(4), ఐటీ యాక్ట్ సెక్షన్లు 66(c),66(D) కింద దర్యాప్తు చేపట్టారు.
బాధితుడి సొమ్మును తిరిగి జమ చేయించడంలో, మిగిలిన మొత్తాన్ని నిలిపివేయడంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె. నరేష్, ఎస్ఐ ఎస్.కె. జుబేదా, సిబ్బంది డి. వంశీకృష్ణ, బి. శ్రావణ్ కుమార్, వి. రజిత, సుప్రియ కీలకంగా వ్యవహరించినట్లు ఎస్పీ కార్యాలయం తెలిపింది.
సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి - ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. ముఖ్యంగా గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేస్తే నగదు బదిలీని నిలువరించి, సొమ్మును తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అపరిచిత లింకులపై క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోవద్దని ప్రజలకు సూచించారు.


