హైదరాబాద్ నగరం వైద్య సేవల్లో హబ్ గా మారిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఖమ్మం జిల్లా మండలం కందుకూరులో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును ఆయన శుక్రవారం ప్రారంభించారు.
రాజ్యసభ సభ్యులు, సింధు హాస్పిటల్స్ చైర్మన్ డా. బండి పార్థసారథి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ఎంపీ రవిచంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.
కరోనా సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వైద్యం కోసం హైదరాబాద్ వచ్చారని ఎంపీ రవిచంద్ర తెలిపారు. లాభాపేక్ష లేకుండా 1500 పడకల అత్యాధునిక ఆస్పత్రిని సేవా దృక్పథంతో పార్థసారథి రెడ్డి నిర్మించడం అభినందనీయమని అన్నారు. ఆయన సేవా గుణాన్ని గుర్తించే ప్రధాని మోదీ ఆస్పత్రి ప్రారంభానికి వచ్చారని తెలిపారు.
పార్థసారథి రెడ్డి రాజ్యసభలో అత్యంత ధనవంతులైన ఎంపీ అయినప్పటికీ పన్నులు చెల్లించడంలో కూడా ముందుంటారని కొనియాడారు. క్యాన్సర్ ముందస్తు నిర్ధారణ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు ద్వారా సత్తుపల్లి, కొత్తగూడెం ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందుతాయని అన్నారు.
పార్లమెంటులో తెలంగాణ ప్రజల పక్షాన గళం వినిపించేందుకు పార్థసారథి రెడ్డి లాంటి సహచర సభ్యులు అందిస్తున్న సహకారం మరువలేనిదని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంపులో పలువురు వైద్యులు ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, సూచనలు అందించారు.












