రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో భాగంగా పాలేరు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. సొంతింటి కల నెరవేరిన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొననున్నారు.
దీపావళి పండుగ సందర్భంగా, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇంటి కలను నెరవేర్చుకున్న పేద కుటుంబాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలకరించనున్నారు. వారి ఇళ్లలో దీపాలు వెలిగించి, పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందాన్ని పంచుకోనున్నారు.
మంత్రి పర్యటన షెడ్యూల్
మంత్రి పర్యటన షెడ్యూల్ ప్రకారం, ఉదయం 8:30 గంటలకు ఖమ్మం మండలం కామంచికల్, ఉదయం 9:30 గంటలకు నేలకొండపల్లి మండలం కొరట్లగూడెం, ఉదయం 10:30 గంటలకు కూసుమంచి మండలం పాలేరులో ఆయన పర్యటించనున్నారు.
పేదల సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు, వారి కుటుంబాల్లో దీపావళి వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా గృహప్రవేశాలు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పండుగ జరుపుకోవాలని మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు.












