ఎల్కతుర్తి, 12 November
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ ఇళ్ల దీపావళి సంబరాల్లో భాగంగా ఒక దళిత కుటుంబం ఇంటికి వస్తారని ముందుగా సమాచారం ఇచ్చి, చివరి నిమిషంలో కార్యక్రమాన్ని మరో బీసీ కుటుంబానికి మార్చడంపై ఎమ్మార్పీఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్య దళిత కుటుంబానికి అవమానం కలిగించిందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
సమానత్వం, సామాజిక న్యాయం, పేదల ఆత్మగౌరవం అంటూ ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో దళిత కుటుంబాలకు కనీస గౌరవం దక్కడం లేదని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు అడ్డూరి అనిల్ మాదిగ అన్నారు. దీపావళి పండుగ వేళ లో చోటుచేసుకున్న పరిణామం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాల కార్యక్రమంలో భాగంగా తమ ఇంటికి వస్తారని ముందస్తు సమాచారం అందడంతో, ఆ దళిత కుటుంబం ఆనందించి, ఇంటిని శుభ్రం చేసుకుని, పండుగ ఏర్పాట్లు చేసి, మంత్రి రాక కోసం ఆశగా ఎదురుచూసిందని తెలిపారు. కానీ చివరి నిమిషంలో కార్యక్రమం మరో బీసీ కుటుంబం ఇంటికి మారడంతో ఆ దళిత కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందన్నారు.
ఇది కేవలం ప్రణాళిక మార్పా లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈ మార్పునకు సంబంధించిన వాస్తవాలను అధికారులు ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత కుటుంబం ఇంట్లో మంత్రి పర్యటన ఉంటుందని చెప్పి ఆశలు కల్పించి, చివరకు మరో ఇంటికి వెళ్లడం వల్ల ఆ కుటుంబం పడిన బాధను ఎవరు అర్థం చేసుకుంటారని అడ్డూరి అనిల్ మాదిగ ప్రశ్నించారు. ఒక పేద కుటుంబానికి మంత్రి ఇంటికి రావడం అనేది కేవలం ఒక కార్యక్రమం కాదని.. అది వారి కుటుంబ గౌరవానికి, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో కులం, వర్గం, రాజకీయాలకు తావు ఉండకూడదని, రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. దళితుల ఇళ్లకు వెళ్లినంత మాత్రాన సామాజిక న్యాయం చేసినట్లు కాదని, వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నప్పుడే నిజమైన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి గ్రామ కార్యదర్శి, స్థానిక నాయకులు ముందుగా సమాచారం ఇచ్చినట్లు బాధిత కుటుంబం చెబుతోందని, అలాంటప్పుడు చివరి నిమిషంలో మార్పు ఎందుకు జరిగిందని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు మంత్రి దృష్టికి అసలు విషయాలు వెళ్లాయా అధికారుల నుంచి సరైన సమాచారం అందిందా అనే ప్రశ్నలకు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కులవివక్ష జరిగిందనే ఆరోపణలపై కూడా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆయన అన్నారు.
1. దళిత కుటుంబం ఇంట్లో జరగాల్సిన కార్యక్రమాన్ని చివరి నిమిషంలో ఎందుకు మార్చారో అధికారికంగా వెల్లడించాలి. 2. ఈ నిర్ణయం తీసుకున్న అధికారుల పాత్రపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలి. 3. బాధిత కుటుంబానికి జరిగిన మనోవేదనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించాలి. 4. కార్యక్రమ మార్పు వెనుక కులపరమైన వివక్ష ఉన్నట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 5. భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ కుటుంబానికీ కులం ఆధారంగా అవమానం జరగకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. మన హక్కుల విషయంలో మౌనంగా ఉండాల్సిన అవసరం లేదని, ఆత్మగౌరవం కోసం ప్రశ్నించాలని, రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఐక్యంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాలని అడ్డూరి అనిల్ మాదిగ పిలుపునిచ్చారు. ఇది ఏ ఒక్క కుటుంబానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని, సమాజంలో సమానత్వం, గౌరవం నిలబడాలనే ప్రశ్న అని ఆయన అన్నారు.






