ఖమ్మం, 2026-11-13
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు కేటీఆర్ అభినందించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్‌లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర పార్టీ నాయకత్వం పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, పార్టీ క్యాడర్ క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, పట్టభద్రులతో మమేకమై ఉచిత నమోదు కార్యక్రమాలను చేపట్టింది. ఖమ్మం నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ఖమ్మం నియోజకవర్గ నాయకులను, కార్యకర్తలను, జిల్లా క్యాడర్‌ను యువనేత కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలతో పాటు , ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని అధికార కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్న నేపథ్యంలో, కార్పొరేషన్ ఎన్నికలపై కీలక చర్చలు జరిగాయి. ఎన్నికల వ్యూహంపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
పార్టీ బలోపేతం దిశగా మొదటి నుండి పార్టీతో ఉన్న సామాన్య కార్యకర్తలకు, వివిధ రంగాల్లో ఉద్యమకారులకు, విద్యార్థులకు, యువతతో పాటు అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ.. పదవులు, అధికారం ఉన్నా లేకున్నా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నిజమైన క్యాడర్‌కు బంగారు భవిష్యత్తు కల్పించేలా, యువతలో నాయకత్వాన్ని ప్రోత్సహించేలా చర్చించారు.
త్వరలో కేసీఆర్ ఆదేశాలతో పార్టీ కమిటీల నిర్మాణం జరగబోతుందని, ఇందులో యువతకు ప్రాధాన్యత ఇస్తూనే, పార్టీకి ఎనలేని సేవలు అందించిన నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించేలా కసరత్తు చేయాలని నిర్ణయించారు.
త్వరలో భారీ ఎత్తున కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి చేరికలు ఉండబోతున్నాయని, కేటీఆర్ ఖమ్మం పర్యటన తేదీ ఖరారు లోపు జిల్లా నాయకత్వంతో పూర్తిస్థాయి చర్చలు జరిపి, ఖమ్మంలో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.






