కెరమెరి (ఆజాద్ తెలంగాణ) నవంబర్ 06
ప్రజా వేదికకు హాజరుకాని మేట్లను తొలగించాలి డీఆర్డీఓ బానోత్ దత్తరాం
ఉపాధి హామీ పథకం కింద కెరమెరి మండల వ్యాప్తంగా చేపట్టిన పనుల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని, సామాజిక తనిఖీల్లో గుర్తించిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ బానోత్ దత్తరాం అధికారులను ఆదేశించారు. డబుల్ జాబ్ కార్డులను తొలగించడంతో పాటు, ప్రజా వేదికకు హాజరుకాని మేట్లను విధుల నుంచి తొలగించాలని సూచించారు.
కెరమెరి ఎంపీడీఓ కార్యాలయంలో 2025 మార్చి నుంచి 2026 ఏప్రిల్ వరకు మండల పరిధిలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. గత వారం రోజులుగా వివిధ గ్రామపంచాయతీల పరిధిలో చేపట్టిన పనులను సామాజిక తనిఖీ బృందాలు పరిశీలించాయి. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులు, ఖర్చులు, కూలీలకు చెల్లించిన వేతనాలు, మెటీరియల్ వినియోగానికి సంబంధించిన వివరాలను గ్రామపంచాయతీల వారీగా ప్రజావేదికలో నివేదిక రూపంలో చదివి వినిపించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పనుల కోసం వేతనాల రూపంలో రూ.7,06,72,015, మెటీరియల్ రూపంలో రూ.37,27,821 ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం రూ.7,43,99,836 విలువైన పనులు చేపట్టినట్లు వివరించారు. సామాజిక తనిఖీల్లో భాగంగా సుమారు రూ.6 లక్షల రికవరీ గుర్తించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీడీవో సాయికుమార్ గౌడ్, ఏపీఓ మల్లయ్య, ఏవివో ఆంజనేయులు, ఎస్పీఎం సాయి జ్ఞానేందర్, ఎస్ఆర్పీ ఏం రాజ శేఖర్, మండలంలోని వివిధ గ్రామపంచాయతీ కార్యదర్శులు, వి.బి.జి. రాంజీ సిబ్బంది, 13 మంది డీఆర్పీలు, 15 మంది బీఎస్వీలు తదితరులు పాల్గొన్నారు.










