ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని కరంజివాడ (గోండుగూడ) గ్రామస్తులు నిరూపిస్తున్నారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆదివాసీ జీవన విధానం నేటికీ సజీవంగా కొనసాగుతోంది.దీపావళి పండుగను పురస్కరించుకుని ఆదివాసి గూడాలలో పది రోజుల పాటు జరిగే గుస్సాడి దండారి ఉత్సవాలు అందుకు నిలబెత్తు నిదర్శనం.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మండలంలోని కరంజివాడ గోండుగూడలో గుస్సాడి దండారి ఉత్సవాలు అత్యంత నియమ నిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. దీపావళికి ముందు నుంచే గూడాలలో పండుగ వాతావరణం నెలకొంటుంది. గ్రామ పెద్ద, నాగోబా పూజారి కుమ్రా భోజు పటేల్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా దండారి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తారు.
దండారి వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి గాదిగూడ మండలం రుప్పాపూర్ గ్రామానికి చెందిన గుస్సాడీ బృందం కరంజివాడ గ్రామానికి చేరుకొని, గ్రామస్తుల డప్పు చప్పుల మధ్య ఘన స్వాగతం అందుకుంది. అనంతరం సాంప్రదాయ పూజలతో, నృత్యాలను, నాటికను ప్రదర్శించారు. ఆదివారం మధ్యాహ్నం ఎత్మ సూర్ పెన్ పూజ నిర్వహించి, గుస్సాడి బృందానికి పాథీఘాటో (భోజనం) ఏర్పాటు చేశారు.
గుస్సాడి దండారి అంటే కేవలం నృత్యం కాదని, అది ఒక దీక్ష అని గ్రామ పెద్ద కుమ్ర బొజ్జు పటేల్ వివరించారు. ఈ పది రోజులు గుస్సాడీలు ఎంతో నియమబద్ధంగా ఉంటారని, మాంసాహారం, మద్యం ముట్టక ఇంటికి దూరంగా, పెన్ గుడి వద్దనే ఉంటూ, రోజూ పూజలు చేస్తారని తెలిపారు. తమ గూడాను, తమ ప్రజలను, పంటలను, పశుసంపదను కాపాడాలని పెన్ దేవుళ్ళను వేడుకుంటారని ఆయన పేర్కొన్నారు.
ప్రతిరోజూ సాయంత్రం డోలు, డప్పు, కాళీ, తుడుం వంటి వాయిద్యాల మోతతో గూడా మారుమోగుతుంది. సంప్రదాయ వేషధారణలో, తలపై నెమలి ఈకలతో, రంగురంగుల పూసలతో అలంకరించిన పెద్ద కిరీటం ధరించి, ఒంటిపై నెమలి ఈకలు, గజ్జలు, చేతిలో కర్రతో నృత్యం చేశారు.
గుస్సాడి వేషధారణలో చేసే నృత్యాలు చూసే ప్రజల మనసులను మంత్రముగ్ధులను చేస్తాయి. డోలు వాయిద్యానికి అనుగుణంగా లయబద్ధంగా చేసే అడుగులు, ఒక్కో అడుగుకు మోగే గజ్జల శబ్దం, నెమలి ఈకల కిరీటంతో చేసే విన్యాసాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
ఈ నృత్యాలను చూడటానికి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా, దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా యువత, చిన్నారులు గుస్సాడి నృత్యాల పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.
దండారి బృందం ప్రతిరోజూ ఒక గూడా నుంచి మరో గూడాకు వెళ్లి, అక్కడి ప్రజలను ఆశీర్వదించి, నృత్య ప్రదర్శన ఇస్తుంది. ఆ గూడా ప్రజలు వారికి ఘన స్వాగతం పలికి, అన్నదానం చేసి సత్కరిస్తారు.
గుస్సాడి దండారి కేవలం వినోదం కాదు. ఇది ఆదివాసీల ఆత్మగౌరవానికి, వారి దేవుళ్ళ పట్ల భక్తికి, వారి పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ప్రతీక. నేటి ఆధునిక యుగంలో కూడా తమ సంస్కృతిని మరిచిపోకుండా, యువతకు అందించాలనే తపన ఈ ఉత్సవాల్లో కనిపిస్తుంది.
పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ముగింపు రోజున మరింత వైభవంగా జరుగుతాయి. గూడా మొత్తం ఒక్కచోట చేరి, పెన్ దేవుడికి ప్రత్యేక పూజలు చేసి, గుస్సాడీల దీక్షను విరమింపజేస్తారు. ఆదివాసీల గుస్సాడి దండారి ఉత్సవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది.










