ఖమ్మం అర్బన్, 8 November
ఖానాపురం హవేలీలో నివసిస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారి వేదవ్యాస్ (35) ఆదివారం మరణించారు.
ఖమ్మం కార్పొరేషన్ పరిధి ఖానాపురం హవేలీ నందు నివాసముంటున్న వ్యవసాయ విస్తరణ అధికారి వేదవ్యాస్ (35) ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
ఆయన అకాల మరణం పట్ల మండల సీపీఐ సమితి సభ్యులు బానోతు నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇర్లపూడి రెవెన్యూ పరిధిలోని గ్రామాలకు వ్యవసాయ విస్తరణ అధికారిగా ఆయన అందించిన సేవలు మరువలేనివని తెలిపారు. అకాల మరణం అనే వార్త వినగానే నా హృదయాన్ని కలచి వేసిందని, ఆయన రైతులకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు.
రైతులతో చాలా ఆప్యాయంగా ఉండేవారని, రైతుల సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేసేవారని, చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో కలిసి మెలిసి ఉండేవారని గుర్తు చేశారు. మూడు నెలల క్రితం మండలం నుండి ఖమ్మం రూరల్ పరిధిలోని దానవాయిగూడెంకు బదిలీ అయ్యారన్నారు.
ఆయన మరణం రైతులకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.










